: లాడెన్ ను మట్టుబెట్టడానికి సహకరించిన పాక్ డాక్టర్ పై మర్డర్ కేసు
అగ్రరాజ్యాన్ని సైతం గడగడలాడించిన ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టడంలో కీలకపాత్ర పోషించిన పాకిస్థానీ డాక్టర్... షకీల్ ఆఫ్రిదీపై మర్డర్ కేసు నమోదైంది. 2006లో తన కుమారుడికి డాక్టర్ ఆఫ్రిదీ అపెండిసైటిస్ ఆపరేషన్ నిర్వహించారని... అనంతరం తన కుమారుడు చనిపోయాడని... ఆ బాలుడి తల్లి ఐదు నెలల క్రితం కేసు పెట్టింది. ఫిజీషియన్ అయిన ఆఫ్రిదీ సర్జరీ చేశాడని ఆమె ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాక్టర్ ఆఫ్రిదీపై మర్డర్ కేసు నమోదు చేశారు.
ఇప్పటికే డాక్టర్ ఆఫ్రిదీ దేశ ద్రోహం నేరం కింద్ర 33 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఖైబర్ ప్రావిన్సులో తీవ్రవాదులకు సహకారం అందించారన్న ఆరోపణలతో ఆయనకు ఈ శిక్షను విధించారు. లాడెన్ ను మట్టుబెట్టడానికి సహకరించిన ఆఫ్రిదీని విడుదల చేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో అమెరికాకు, పాకిస్థాన్ కు భేదాభిప్రాయాలు కూడా నెలకొన్నాయి