: ఈ కార్లు కాలుష్య రహితం!


కార్లు వదిలే పొగనుండి వాతావరణం కలుషితమైపోతోంది. అందుకే, ఇప్పుడు కాలుష్య రహితమైన హైడ్రోజన్‌ కార్లు త్వరలోనే రానున్నాయి. వచ్చే ఏడాదికి ఈ కార్లు అమెరికా, జపాన్‌ దేశాల్లో రోడ్లపైకి వస్తాయట. మన దేశానికి రావడానికి మరికొంత కాలం పడుతుంది.

లాస్‌ ఏంజెల్స్‌, టోక్యో ఆటోమొబైల్‌ ప్రదర్శనల్లో ప్రముఖ తయారీదారులు ఈ కార్లను ప్రదర్శనకు ఉంచారు. పర్యావరణానికి హాని కలిగించని హైడ్రోజన్‌ కార్లను మార్కెట్లోకి తేవడానికి హ్యుందాయ్‌ మోటార్స్‌ కంపెనీ ఆరాటపడుతోంది. అయితే వీటిని ముందుగా లాస్‌ ఏంజెల్స్‌లో మాత్రమే అదుబాటులో ఉంచనున్నారు. హ్యుందాయ్‌ కూడా 2015 నాటికి లాస్‌ ఏంజెల్స్‌లో హైడ్రోజన్‌ కారును అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. టొయోటా సంస్థ 2015 నాటికి జపాన్‌లోను, 2016 నాటికి అమెరికాలోను హైడ్రోజన్‌ కారును అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది.

ఈ సంస్థ తాము విడుదల చేయబోయే హైడ్రోజన్‌ కారు ధర రూ.32 లక్షల నుండి 64 లక్షల వరకూ ఉండవచ్చని ప్రకటించింది. ఈ కార్లలోని హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్స్‌ సంక్లిష్ట రసాయన ప్రక్రియ ద్వారా పనిచేస్తాయి. హైడ్రోజన్‌ అణువులోని ఎలక్ట్రాన్‌, ప్రోటాన్‌లను ఈ సెల్స్‌ వేరుచేస్తాయి. అలా ఉత్పత్తి అయిన ఎలక్ట్రాన్‌లు ధనదృవం వైపు కదిలేలా చేస్తారు. ఈ సమయంలో జరిగే రాపిడి కారణంగా ఉత్పత్తి అయిన విద్యుత్తు కారుకు ఇంధనంగా పనిచేస్తుంది. ఇక్కడ హైడ్రోజన్‌ను మండించకపోవడంతో ఎలాంటి కాలుష్యకారకాలు ఉత్పత్తి కావు. మొత్తం ప్రక్రియలో కేవలం నీటి ఆవిరి మాత్రమే వ్యర్థంగా వెలువడుతుంది.

  • Loading...

More Telugu News