: సోనియాను దేశం నుంచి తరిమికొట్టాలి: హరికృష్ణ బహిరంగ లేఖ
దేశాన్ని ముక్కలు చేస్తూ జాతుల మధ్య చిచ్చురేపుతున్న సోనియాను దేశం నుంచి తరిమికొట్టాలని నందమూరి హరికృష్ణ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో సమైక్య ఉద్యమం ప్రజల్లోనుంచి పుట్టిందని... తెలుగుజాతి కోరుతోంది సమైక్య రాష్ట్రమేనని తెలిపారు. రాజకీయ నాయకులు కేంద్రానికి వత్తాసు పలుకుతూ... లక్షల కోట్ల ప్యాకేజీలు, సమన్యాయం, కొత్త రాజధాని అంటున్నారని విమర్శించారు. జల వివాదాలను పరిష్కరించకుండా రాష్ట్రాన్ని విభజిస్తే... కృష్ణా, గోదావరి నదుల్లో నీటికి బదులు నెత్తురు ప్రవహిస్తుందని హెచ్చరించారు.
ప్రజలను మభ్యపెడుతూ వచ్చిన కాంగ్రెస్ నాయకులు, 2014లో ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం ప్రజల వద్దకు వస్తారని హరికృష్ణ ప్రశ్నించారు. తనతో పాటు అందరూ రాజీనామా చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. కేంద్రానికి సహకరించే ఏ నాయకుడైనా ప్రజాకంఠకుడే అని చెప్పారు. చివరకు దేవుడిని కూడా వివాదాల్లోకి లాగారని... ఇది సరైంది కాదని అన్నారు. ఎన్టీఆర్ సమైక్యవాదమే తన వాదమని తెలిపారు.