: ఎముకలు బలంగా ఉండాలంటే...
మన ఎముకలు బలంగా ఉండాలంటే చక్కటి ఆహారం తీసుకోవాలి. పెరిగిన బరువు తగ్గించుకోవాలంటే చక్కటి వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే జిమ్‌లకు వెళ్లి చెమటలు పట్టేలా చేసేదే కాదు... చక్కగా ఇంట్లోనే ఉంటూ మీకు తీరిక సమయాల్లో చేసుకోవచ్చు. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్కిప్పింగ్. మనం చిన్నప్పుడు ఎగిరేవాళ్లం. పెద్దయ్యాక ఇంకేం ఎగురుతాంలే అనే భావంతో తాడుని ఓ మూల పడేస్తాం. భారీ కాయాన్ని తగ్గించుకోవడానికి మళ్లీ జిమ్ములకు వెళుతుంటాం. అలాకాకుండా స్కిప్పింగ్ వల్ల బోలెడు లాభాలున్నాయట.
స్కిప్పింగ్ చేయడం వల్ల జిమ్‌లో చెమటలు పట్టేలా వ్యాయామం చేసినప్పుడూ, వేగంగా పరిగెత్తినప్పుడూ ఖర్చయ్యే కేలరీలకన్నా ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయట. అంటే అరవై శాతం కేలరీలు స్కిప్పింగ్ చేయడం వల్ల ఖర్చవుతాయట. ఈ ఆట మనకు ఆనందాన్నివ్వడమే కాదు, శరీరంలో కొవ్వు పేరుకోవడాన్ని కూడా నిరోధిస్తుంది. ఎగరడం వల్ల ఎముకలు కూడా బలంగా, దృఢంగా తయారవుతాయి. ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. వేగంగా ఎగరడం వల్ల రక్త ప్రసరణ చక్కగా జరిగి గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఫలితంగా గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. ఇతర వ్యాయామాలు చేసేందుకు తీరిక లేకున్నా కనీసం ఇంట్లో తీరిక సమయంలో స్కిప్పింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతోబాటు బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు కదా.