: మనం కష్టజీవులమట
భారతీయులు కష్టజీవులట. విరామమనేదే లేకుండా నిరంతరాయంగా ఆఫీసులకు వెళుతూ పనిచేసేస్తుంటారట. ఇది ఎవరో చెబుతున్న ఉత్తి మాటలు కాదు. చక్కగా సర్వే చేసి చెబుతున్నారు. భారతీయులు సెలవులు, విరామం అనేది లేకుండా పనిచేస్తుంటారట. ఇలా పనిలోనే కాలం గడిపేవారిలో ప్రపంచంలోనే భారతీయులది పదవ స్థానమట. ఆఫీసులకు సెలవులు ఇచ్చినా, వారు ఐచ్ఛిక సెలవులు పెట్టుకున్నా కూడా బయటికి వెళ్లి ఎంజాయ్ చేద్దామనే ఆలోచన లేకుండా ఇంట్లో కుదురుగా కూర్చుని మెయిల్స్ చెక్ చేసుకోవడమో లేదా వేరే ఏదైనా పెండింగ్ పనులను చేసుకోవడమో చేస్తుంటారట.
ఎక్స్‌పెడియా అనే ఆన్లైన్ రవాణా సేవల సంస్థ తన తాజా నివేదికలో పలు దేశాలవారి సెలవు రోజుల అలవాట్లపై సర్వే చేసింది. ఈ సర్వేలో విరామమెరుగక పరిశ్రమించే కష్టజీవులకు సంబంధించి మనం పదవ స్థానంలో ఉన్నామని తేలింది. భారతీయులకు సగటున ఏడాదికి 26 సెలవులుంటే అందులో కేవలం 20 మాత్రమే ఉపయోగించుకుంటున్నారట. ఆ సెలవుల్లో కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారా అంటే అది కూడా లేదట. సెలవు పెట్టినరోజుల్లో 94 శాతంమంది మెయిల్స్ చూసుకుంటూనో లేదా వేరే పనులను చేసుకుంటూనో గడిపేస్తున్నారట. ఈ విషయంలో ఫ్రాన్స్, థాయ్‌ల్యాండ్, మలేషియా, మెక్సికో దేశాల వారు మన తర్వాతే ఉన్నారట. 38 శాతం మంది భారతీయులు వారానికి 41 నుండి 50 గంటలు పనిచేస్తున్నారట.
ఇలా చూసినా కూడా పనికీ, జీవితానికీ మధ్య ఇంకా సమతుల్యత సాధించాల్సి ఉందని ఎక్స్‌పెడియా జనరల్ మేనేజర్ విక్రమ్ మల్హి చెబుతున్నారు. మరో ముఖ్యవిషయం ఏమంటే, 37 శాతం మంది సెలవు తీసుకోవడంకంటే ఆ రోజు పనిచేసి డబ్బులు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారట. అంటే సెలవుకంటే డబ్బే ముఖ్యమని భావించేవారిలో ఎక్కువమంది ఢిల్లీ వాళ్లే ఉన్నారట.