: ముందే హెచ్చరించినా మనం పట్టించుకోమట
ఏదైనా ప్రమాదం వస్తుందని మనకు ముందే తెలిస్తే వెంటనే మనం ఆ ప్రమాదం నుండి బయటపడేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదే గుండెపోటు వంటి అనారోగ్యపరమైన ప్రమాదం వస్తుందని నెల ముందుగా తెలిస్తే తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇలాంటి హెచ్చరికలు ఎవరు చేస్తారు... అంటే మన శరీరమే చేస్తుందట. కానీ మనం ఆ హెచ్చరికలను గుర్తించం. తీరా గుండెపోటు వచ్చాక వైద్యుల వద్దకు పరుగెత్తుతాం. గుండెపోటు వచ్చేందుకు నెల ముందే మన శరీరం హెచ్చరిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
సాధారణంగా గుండెలోని విద్యుత్తు వ్యవస్థ విఫలం కావడం వల్ల గుండె పనిచేయడం ఆగిపోయి సడెన్ కార్డియాక్ అరెస్టుకు దారితీస్తుంది. అయితే ఈ సంఘటన హటాత్తుగా సంభవించదు. ఇలా జరగడానికి నెలముందునుండే మన శరీరం హెచ్చరికలను అందజేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. సడెన్ కార్డియాక్ అరెస్టు బారినపడిన 53 శాతం మందిలో చాలాకాలం ముందునుండే ఛాతీనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు. వీరిలో 56 శాతం మందిలో ఛాతీలో నొప్పి, 13 శాతం మందిలో శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, 4 శాతం మందిలో తలతిప్పుట, వణుకు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలను పరిశోధకులు కనుగొన్నారు. కాబట్టి మన శరీరం చేసే హెచ్చరికలను గుర్తించాలని, ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టరును సంప్రదించడం మేలని సీడర్`సినై హార్ట్ ఇన్స్టిట్యూట్కు చెందిన సుమీత్ చుగ్ చెబుతున్నారు.