: పిల్లలే అయితేనేం... పర్వతాన్నెక్కేశారు
చిన్న పిల్లలు అని మనం తక్కువగా చూస్తుంటాం. 'మేం చిన్న పిల్లలమే అయినా చాలామంది పెద్దవారికి కూడా సాధ్యంకాని ఎత్తైన పర్వతాన్ని సునాయాసంగా ఎక్కేశాం' అంటున్నారు ఈ పిల్లలు. మనరాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల్లో తొమ్మిదవ తరగతి, ఇంటర్ చదివే విద్యార్ధులు భూమికి 1700 అడుగుల ఎత్తున హిమాలయాల్లో భాగమైన రీనాక్ శిఖరాన్ని అధిరోహించి అందరినీ అబ్బురపరచారు.
రీనాక్ శిఖరారోహణ పేరుమోసిన పర్వతారోహకులకు కూడా ఒక కల లాంటిది. ఈ చిన్నారులు దాన్ని సాకారం చేసుకున్నారు. అంతేకాదు చిన్న వయసులో కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమేనని నిరూపించారు. ఇందుకోసం ప్రాథమిక దశలో 150 మందిని ఎంపిక చేసి, పలు వడపోతల తర్వాత 20 మందిని ముగ్గురు పీఈటీల రక్షణలో అక్టోబరు 25న తీసుకెళ్లారు. వీరంతా రీనాక్ శిఖరాన్ని అధిరోహించి విజయగర్వంతో తిరిగి వచ్చారు. చిన్న పిల్లలకు పెద్ద పనులు కూడా సాధ్యమేనని వీరంతా చాటి చెప్పారు.