: బరువు పెరిగితే బ్రెస్ట్ క్యాన్సర్?
అధిక బరువు కారణంగా పలు రకాల అనారోగ్యాలు పలకరిస్తాయి. ముఖ్యంగా మహిళలకు బరువు పెరగడం వల్ల వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం అనేది ఆస్తిని పెంచుకోవడం కాదు... కాబట్టి బరువు తగ్గమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక బరువుండే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నార్త్ కరోలినా విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయన కర్తలు నిర్వహించిన పరిశోధనల్లో అధిక బరువు కారణంగా మగువల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని తేలింది. బరువు ఎక్కువగా ఉండేవారికి క్షీరగ్రంధుల్లోని కణాల్లో ప్రమాదకరమైన బేసల్ ఉప రకం రొమ్ము క్యాన్సర్ కణతులు ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు తలెత్తుతాయని పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలోని హెపటోసైట్ అభివృద్ధికారక ప్రోటీన్లు, బేసల్ రకం కారక సి-మెట్ జన్యువుల మధ్య సంబంధముంటుంది. ఈ కారణంగా అధిక బరువుండే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనకర్తలు లిజా మాకోవ్‌స్కీ, స్నేహా సుందరంలు చెబుతున్నారు. బరువును తగ్గించుకోవడం వల్ల మనం అందంగా, వయసు తక్కువగా, ఆరోగ్యంగా కూడా కనిపిస్తాం. ఇన్ని లాభాలున్నప్పుడు ఎలాగోలా బరువు తగ్గడానికి ప్రయత్నించండి.