: రాకాసి బల్లులు అంత పెద్దగా ఎలా ఎదిగాయి?
ఒకప్పుడు భూమిపై రాకాసి బల్లులు అనే జీవులు ఉండేవని మన పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే అంత పెద్ద జీవులు అసలు ఎలా ఉండేవి? అనే అనుమానం మనకు రాకపోదు. జీవులు అంత పెద్దగా ఎదగడానికి కారణం అప్పట్లో భూమిపై ఆక్సిజన్ తక్కువ పరిమాణంలో ఉండడమే కారణమని పరిశోధకులు చెబుతున్నారు.
ఒకప్పుడు భూమిపై అధిక మొత్తంలో ఆక్సిజన్ ఉండేదని, ఈ కారణంగానే రాక్షస బల్లులు అంత పెద్ద ఆకారంతో ఎదిగి ఉంటాయని మొదట్లో చాలామంది శాస్త్రవేత్తలు భావించారు. అయితే ఈ భావనలను తప్పని, నిజానికి రాకాసి బల్లుల కాలంలో భూమిపై ఆక్సిజన్ పరిమాణం తక్కువగా ఉండేదని, కాబట్టే అవి అంత పెద్దవిగా ఎదిగాయని తాజాగా పరిశోధకులు నిర్ధారించారు. ఆస్ట్రియాలోని ఇన్స్‌బ్రక్ విశ్వవిద్యాలయానికి చెందిన రాల్ఫ్ టాపర్ట్ నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన పరిశోధనలో 22 కోట్ల సంవత్సరాల క్రితం భూమి వాతావరణంలో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉండేదని, కాబట్టే రాకాసి బల్లులు అంత పెద్దవిగా ఎదిగాయని నిర్ధారించారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు మొక్కల శిలాజాలు, ఆధునిక వృక్షాలను పరిశీలించారు.
ఈ పరిశోధనలో గత 22 కోట్ల సంవత్సరాల్లో ఆక్సిజన్ పరిమాణం ఇప్పుడున్న 21 శాతంకన్నా చాలా తక్కువగా ఉండేదని, అది పదినుండి 15 శాతం మధ్య ఉండవచ్చని టాపర్ట్ చెబుతున్నారు. ఆక్సిజన్ పరిమాణం తక్కువగా ఉన్న సమయంలోనే ప్రపంచ ఉష్ణోగ్రతలు, కార్బన్‌డై ఆక్సైడ్ స్థాయి ఎక్కువగా ఉండేదని, ఆక్సిజన్, కార్బన్‌డై ఆక్సైడ్ పరిమాణంపై ప్రభావం చూపుతుందని, కొన్ని సందర్బాల్లో కార్బన్‌డై ఆక్సైడ్ ఉధృతిని పెంచుతుందని టాపర్ట్ చెబుతున్నారు.