: నిన్న కాలేయం... ఈరోజు కిడ్నీ...
త్రీడీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కృత్రిమ అవయవాలను శాస్త్రవేత్తలు తయారుచేసేస్తున్నారు. ఇటీవలే మూలకణాలతో అతిచిన్న త్రీడీ కాలేయాన్ని తయారుచేసిన శాస్త్రవేత్తలు ఇప్పుడు మూత్రపిండాల నిర్మాణాన్ని కూడా అభివృద్ధి చేశారు.
సాల్క్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ స్టడీస్‌కు చెందిన పరిశోధకుల బృందం త్రీడీ కణ నిర్మాణాలను తీర్చిదిద్దింది. మానవ మూల కణాలనుండి ఈ పరిశోధకులు తొలిసారిగా త్రీడీ తరహాలో మూత్రపిండాల నిర్మాణాలను అభివృద్ధి చేశారు. తాము నిర్వహించిన ఈ పరిశోధన ద్వారా మూత్రపిండాల వ్యాధుల తీరుపై అధ్యయనం చేయడానికి, సరికొత్త ఔషధాలను రూపొందించేందుకు మార్గం సుగమం అయ్యిందని పరిశోధకులు భావిస్తున్నారు. మానవ మూల కణాలతో వీరు రూపొందించిన మూత్రపిండాలు మానవ మూత్రపిండాల్లోని కణ నిర్మాణాల మాదిరిగానే ఉన్నాయి. తాము మానవ మూల కణాలను యురెటెరిక్ బడ్ త్రీడీ నిర్మాణాలుగా తీర్చిదిద్దేందుకు సరళమైన, సమర్ధమైన పద్ధతిని రూపొందించామని, దానిద్వారా తర్వాత దశలో డక్ట్ వ్యవస్థలా తీర్చిదిద్దవచ్చని పరిశోధకులు ప్రొఫెసర్ జుయాన్ కార్లోస్ ఇజ్పిసువా బెల్మాంటే చెబుతున్నారు. ఈ కణాలను తర్వాత దశలో అవయవ నిర్మాణాలుగా తీర్చిదిద్దేలా రూపొందించినట్టు జుయాన్ చెబుతున్నారు.