: రెండు చోట్లా బీజేపీయే ఉంటే.. మీ చేతుల్లో రెండు లడ్డూలు: మోడీ
'ఒక్కసారి ఊహించుకోండి.. కేంద్రంలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉంటే.. మీ రెండు చేతుల్లోనూ లడ్డూలు ఉన్నట్లే' అంటూ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ ప్రజల ఆదరణ చూరగొనే ప్రయత్నం చేశారు. ఈ రోజు మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ లో జరిగిన బీజేపీ ప్రచార సభలో మోడీ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో ప్రభుత్వం మారబోతోందని.. 2014లో కేంద్రంలో బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పారు.
బీజేపీ దొంగల పార్టీ అన్న కాంగ్రెస్ వ్యాఖ్యలకు మోడీ ధీటుగా స్పందించారు. బీజేపీ ఏం దోచుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. 'మీరు మమ్మల్ని దొంగలంటే అంగీకరిస్తాం. నిజమే మేం మీ(కాంగ్రెస్ నేతల) నిద్రను చోరీ చేశా(నిద్రలేకుండా)ము' అంటూ వ్యాఖ్యానించారు. మిస్టర్ ప్రధానీ.. రాజకీయాల స్థాయిని ఎవరు తగ్గించారు? అంటూ మన్మోహన్ సింగ్ ను ప్రశ్నించారు. మీ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మతిలేనిదంటూ తిట్టిపోశారు అంటూ ఏకి పారేశారు. అభివృద్ధిపై చర్చకు రావాలంటూ కాంగ్రెస్ కు సవాల్ చేశారు. మధ్యప్రదేశ్ లో జాతీయ రహదారులకు మరమ్మతులు చేయించడానికి కూడా కేంద్రం సుముఖంగా లేదని విమర్శించారు.