: హైదరాబాద్, భద్రాచలం రెండూ తెలంగాణలోనే ఉండాలి: జైపాల్ రెడ్డి


బలరాం నాయక్, సర్వే సత్యనారాణలతో కలిసి జీవోఎం కు విభజనపై సమగ్ర నివేదిక అందజేశామని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 45 నిమిషాల పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఎలాంటి ప్రతిపత్తి కావాలనే అంశంపై జీవోఎంకు వివరించామని అన్నారు. తాము కోరుకుంటున్న విధానాలన్నింటినీ కలిపి జీవోఎంకు లిఖిత పూర్వకంగా నివేదిక రూపంలో ఇచ్చామని స్పష్టం చేశారు.

నివేదికలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చించామని... ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను పదేళ్లు ఉంచడానికి ఒప్పుకుంటున్నామని, అయితే పదేళ్ల తరువాత వారు వెళ్లిపోవాల్సిందేనని ఆయన అన్నారు. 65 ఏళ్ల పాటు భద్రాచలం తెలంగాణలోనే ఉంది కనుక ఇప్పుడు కూడా తెలంగాణలోనే ఉంచాలని కోరామని చెప్పారు. వివిధ కారణాల వల్ల తెలంగాణ ఏర్పడిన తరువాత విద్యుత్ లోటు ఉంటుందని, అందుచేత ఇప్పుడున్న విద్యుత్ విధానాన్నే తరువాత కూడా కొనసాగించాలని కోరామన్నారు.

హైదరాబాద్ ఆదాయంపై సీమాంధ్రులకు ఏ రకమైన హక్కు లేదని తెలిపామన్నారు. ఆర్టికల్ 371 డి విషయంలో రెండు ప్రాంతాల ప్రభుత్వోద్యోగులు అవగాహనతో ఉన్నారని... ఎవరి రాష్ట్రంలో వారు పని చేస్తారని అన్నారు. ఈ ఆర్టికల్ ను సవరించక్కర్లేదని, ఎస్సార్సీని చట్టంలాగా చేస్తే పరిష్కారం దొరికినట్టేనని జైపాల్ రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News