: అమ్మా... 'చెత్త' రోబో వచ్చింది!
'అమ్మా... చెత్తబండి వచ్చింది. మీ ఇంట్లో చెత్తని తీసుకొచ్చి వేయండి' అంటూ కొన్ని ప్రాంతాల్లో మైకుల్లో అరవడం మనం వింటుంటాం. ఇప్పుడు ఏకంగా మనుషులతో సంబంధం లేకుండా చెత్తను తీసుకెళ్లే రోబోను పరిశోధకులు తయారుచేశారు.
జపాన్లోని టోయోహషి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు సోషల్ ట్రాష్ బాక్స్ రోబో(ఎస్టీబీ)లను అభివృద్ధి చేశారు. ఈ రోబోలు చక్కగా ఇంటింటికీ వెళ్లి చెత్తను అడిగి వేయించుకుని వెళతాయట. అయితే రోబోలు మనుషులు ఎక్కడున్నారు? ఇళ్లు ఎక్కడున్నాయి? అనే విషయాన్ని ఎలా గుర్తుపడతాయి? అని మీ అనుమానమా! అందుకే మనుషులను చక్కగా గుర్తించేందుకు దీనిలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారట. ఈ రోబోల్లో అమర్చిన ఫైరో ఎలక్ట్రిక్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ల వల్ల ఒంటి వేడి ద్వారా మనుషులను, జనావాసాలను ఇవి గుర్తిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అంటే ఈ రోబోలు చెత్తను తీసుకెళ్లే పని కూడా మనుషులకు తగ్గిస్తాయన్నమాట.