: బెంగళూరులో కలకలం రేపిన పింక్ టెడ్డీ బేర్
ఈ రోజు ఉదయం బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్ పార్కింగ్ స్థలంలో కనిపించిన పింక్ రంగు టెడ్డీ బేర్ కలకలం రేపింది. గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ బెంగళూరులో జరిగే బహిరంగ సభకు వస్తుండడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో అనుమానాస్పదంగా కన్పించిన వస్తువుల గురించి ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఈ నేపథ్యంలో రైల్వేస్టేషన్ వద్ద బొమ్మను గమనించిన పలువురు పోలీసులకు ఎస్సెమ్మెస్ పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన బాంబు స్క్వాడ్ తో అక్కడికి వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కాగా అది మామూలు బొమ్మేనని తెలుసుకుని అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.