: కాంగ్రెస్ ముందుకెళ్తుందని ఊహించలేకపోయాం: లగడపాటి
రాజకీయ అవసరాలకోసం రాష్ట్రాన్ని విభజిస్తారా? అంటూ విజయవాడ ఎంపీ లగడపాటి ప్రశ్నించారు. దత్తపుత్రుడు, వేర్పాటు పుత్రుడుతో కలసి కాంగ్రెస్ అధిష్ఠానం ముందుకు వెళ్తుందని మేమే ఊహించలేకపోయామని వాపోయారు. హైదరాబాద్ మాదాపూర్ లోని ఓ హోటల్లో జరిగిన ఏపీ జర్నలిస్ట్ ఫోరం సమావేశంలో లగడపాటి మాట్లాడారు. 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలూ విభజనకు అనుకూలంగా ఉన్నామని ప్రకటించాయని అన్నారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదిక సిఫార్సుల మేరకు విభజన ప్రక్రియ చేపడతారని భావించామని... కానీ ఇప్పుడు మరోలా జరుగుతోందని లగడపాటి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ తో అందరికీ అనుబంధం ఉందని తెలిపారు. రాజధానిలోనే సంపద, అభివృద్ధి ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ తో కూడిన లేదా హైదరాబాద్ లేకుండా అయినా సరే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే... నక్సలిజం పెరిగిపోతుందని తెలిపారు. ఏపీ విభజనను దేశం మొత్తం గమనిస్తోందని అన్నారు. అందరి ఆమోదంతోనే విభజనపై ముందుకెళ్లాలని కోరారు.