: సచిన్ చిరస్మరణీయ ప్రసంగం.. ఆయన మాటల్లోనే...


22 గజాల స్థలంలోనే నా 24 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇన్నేళ్ల ప్రయాణంలో నా వెనుక, నాతో పాటు ఎంతో మంది ఉన్నారు. 1999లో నా తండ్రి చనిపోయారు. ఆయన గైడెన్స్ లేకపోతే నేను ఈ స్థాయికి చేరుకునే వాడిని కాను. ఎప్పుడూ ఓటమిని అంగీకరించొద్దని నా తండ్రి చెప్పారు. నా బ్యాట్ నుంచి వచ్చిన ప్రతి పరుగు వెనుకా నా తండ్రి ఉన్నారు. ప్రతి తల్లిలానే నా తల్లి కూడా నా ఆరోగ్యం గురించే ఆలోచించేవారు. నా కోసం ప్రతి రోజూ ఆమె ప్రార్థనలు చేశారు. విజయానికి అడ్డదారులు లేవని నా తల్లి నాకు చెప్పారు. నా సోదరుడు అజిత్ నా కెరీర్ మొత్తం నా వెన్నంటే ఉన్నారు. నా కోసం అజిత్ తన కెరీర్ నే పణంగా పెట్టారు. నా 11 ఏళ్ల వయసు నుంచి ఆయన నా కోసం ఎంతో చేశారు.

నా విజయంలో మా అక్క పాత్ర కూడా ఎంతో కీలకం. మా అక్కే నాకు మొదటి కాశ్మీర్ విల్లో బ్యాట్ కొనిపెట్టారు. నా గురువు అచ్రేకర్ నాకు క్రికెట్ అంటే ఏంటో నేర్పారు. మొదటిసారి అన్న అజిత్ నన్ను అచ్రేకర్ సార్ దగ్గరకు తీసుకెళ్లినప్పుడు నేనెంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. నా కెరీర్ ప్రారంభం నుంచి ఆయన అండ నాకుంది. ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలని అచ్రేకర్ సార్ నాకు నిరంతరం గుర్తు చేసేవారు. "సార్... నా లాస్ట్ మ్యాచ్ ముగిసిపోయింది" అని సచిన్ తన గురువును ఉద్దేశిస్తూ అన్నాడు.

1991లో నా భార్య అంజలిని మొదటిసారి కలుసుకున్నాను. ఆమె నా జీవితంలోకి వచ్చినప్పట్నుంచి నా కోసం ఎంతో చేసింది. 'నీవు క్రికెట్ గురించి ఆలోచించు.... నేను కుటుంబం గురించి కేర్ తీసుకుంటా'నని అంజలి చెప్పింది. నా కోసం నా భార్య వైద్య వృత్తిని కూడా పణంగా పెట్టింది. ఆమె ప్రోత్సాహం లేకపోతే నేను క్రికెట్ లో ఈ స్థాయికి రాలేకపోయేవాడినేమో (ఈ మాటలు సచిన్ చెబుతున్నప్పుడు... అంజలి ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు)! నా పిల్లలు సారా (16), అర్జున్ (14)లు కూడా పెద్ద వాళ్లయిపోయారు. క్రికెట్ ధ్యాసలో నేను వారికి సమయాన్ని కూడా కేటాయించలేకపోయాను. ఇప్పట్నుంచి మరో 16 సంవత్సరాలు లేదా ఇంకా ఎక్కువ సమయం వారితో గడుపుతాను.

నా కెరీర్ ప్రారంభంలో ఎప్పుడు గాయాలయినా.. నేనెంతో బాధపడేవాడిని. ఎందుకంటే గాయాలతో నా కెరీర్ ఆగిపోతుందని నేను భయపడేవాడిని. అప్పుడు నా మిత్రులు నాకు ఎంతో సహాయం చేశారు. వారిని నేనెప్పుడూ మర్చిపోలేను. 11 ఏళ్ల వయసులోనే నేను కష్టపడటం నేర్చుకున్నాను.

నా తోటి ఇండియన్ క్రికెటర్లకు ఓ మాట చెప్పాలనుకుంటున్నా. ఇండియన్ క్రికెట్ టీంకు ఎంపిక కావడం ఎంతో గొప్ప విషయం. మీరంతా దేశం కోసం పోరాడండి. మీలోని ఎబిలిటీని పూర్తి స్థాయిలో బయటపెట్టండి. దేశానికి గర్వకారణంగా నిలవండి. నా కెరీర్లో నాకు అయిన గాయాలు నన్నేమీ చేయలేకపోయాయి. నాకు గాయాలయినప్పుడు... నా డాక్టర్లు కూడా ఎంతో శ్రమపడ్డారు. నా మేనేజర్ కార్ యాక్సిడెంట్ లో చనిపోవడం నాకు ఎంతో బాధను కలిగించింది.

క్రికెట్ ఎప్పుడూ నా హృదయంలో నిలిచిపోతుంది. అనిల్ కుంబ్లే, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్ లు నా కుటుంబ సభ్యుల్లాంటి వారు. వెస్టిండీస్ ఆల్ టైం గ్రేట్ వివియన్ రిచర్డ్స్ నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి. ఆయనతో నాకెంతో అనుబంధం ఉంది. ఇంతకాలం నా వెనుక ఉండి నన్ను ఎంతో ప్రోత్సహించిన అభిమానులను నేను మర్చిపోలేను (ఈ మాటలంటున్న సమయంలో 'సచిన్' అన్న నినాదాలతో స్టేడియం హోరెత్తింది). మీడియా, ఫొటోగ్రాఫర్లకు కూడా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.. అంటూ సచిన్ భావోద్వేగంతో తన జీవితంలో భాగమైన ఆటకు వీడ్కోలు చెప్పే ముందు చిరస్మరణీయ ప్రసంగం చేశాడు.

  • Loading...

More Telugu News