: రామ్ లీలా... సంజయ్ మరో లీల!
హిందువుల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలు, సినిమాను రిలీజ్ చేయకూడదంటూ డిమాండులు, కోర్టు కేసులు... ఇవన్నీ దాటుకుని వచ్చిన సంజయ్ లీలా భన్సాలీ సినిమా 'రామ్ లీలా' ఈ రోజు దేశవ్యాప్తంగా విడుదలయింది. రిలీజ్ కు ముందు నుంచే వివాదాల్లో ఇరుక్కోవడంతో ఎంతో పబ్లిసిటీ సంపాదించుకున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా హిట్ టాక్ సంపాదించుకుంది. భన్సాలీ రేంజ్ కు తగ్గట్టే రామ్ లీలా మరో బ్లాక్ బస్టర్ గా విమర్శకుల అభినందనలు అందుకుంది.
షేక్స్ పియర్ రచించిన 'రోమియో జూలియట్' డ్రామానే ఈ సినిమాకు మూలం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలనూ దర్శకుడు భన్సాలీ ఇందులో చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు. కలర్ ఫుల్ సెట్స్, ఖరీదైన కాస్ట్యూమ్స్, ఎమోషన్స్, రొమాన్స్, కామెడీ, మెలోడ్రామా... ఇలా ఒకటేమిటి అన్నింటినీ ఈ సినిమాలో చూపించాడు. ఈ సినిమాలో రామ్ పాత్రను రన్వీర్ సింగ్, లీలా పాత్రను దీపికా పదుకొనే పోషించారు.
స్టోరీ విషయానికి వస్తే... వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు. వారి గ్రామంలో రాజాది, సనద అని రెండు తెగలకు చెందిన కుటుంబాలుంటాయి. ఈ రెండు గ్రూపుల మధ్య గత 500 ఏళ్లుగా అంతర్యుద్ధం జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ మొలకెత్తుతుంది. విచక్షణా రహితంగా ఒక తెగపై మరొక తెగ దాడి చేసుకునే గ్రామంలో... తమ ప్రేమను బతికించుకోవడానికి ఈ ప్రేమికులు పడే ఆరాటం, పోరాటమే రామ్ లీలా.
ఈ సినిమాలో రన్వీర్, దీపికాల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. వీరిద్దరి మధ్య సన్నివేశాలను భన్సాలీ చాలా అద్భుతంగా తీశాడు. సినిమాలో పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా దీపికా పదుకొనే డాన్స్ ఈ సినిమాకు హైలైట్. 'నగద ధోల్ బాజే' పాటలో దీపికా అభినయం, ఆమె దుస్తులు మన చూపుల్ని మరల్చుకోనీకుండా చేస్తాయి. దీనికితోడు, మాంటీ శర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన సుప్రియా పాథక్, రిచా ఛద్దా, భర్కా బిస్త్ లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. హీరో, హీరోయిన్ల మధ్య చుంబన దృశ్యాలు ఉన్నప్పటికీ... అవి వెగటుగా కనిపించకుండా కథలో కలసిపోయేలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రామ్ లీలా ఒక అద్భుతం. బాలీవుడ్ నిర్మించిన చిత్రాల్లో రామ్ లీలా కూడా మరో మైలురాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.