: సచిన్ రిటైర్మెంట్ ను గాంధీ మరణంతో పోల్చిన యూఎస్ మీడియా
ఆ దేశంలో క్రెకెట్ పెద్ద ఆటకాదు... క్రికెట్ గురించి ఎక్కువ మందికి తెలియదు కూడా. అదే అగ్రరాజ్యం అమెరికా. టెన్నిస్, బేస్ బాల్, బాస్కెట్ బాల్ లాంటి ఆటలకే అక్కడ ఆదరణ ఉంది. అయితేనేం... అక్కడ మీడియా మాత్రం ఆల్ టైం గ్రేట్ సచిన్ రిటైర్మెంట్ గురించి హైలైట్ చేస్తోంది. ప్రపంచం గర్వించదగ్గ ఆటగాడిని ఆకాశానికెత్తేస్తోంది.
యూఎస్ లోని ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్... క్రికెట్ నుంచి సచిన్ రిటైర్ కావడాన్ని... మహాత్మాగాంధీ మరణంతో పోల్చింది. మహాత్ముడి తర్వాత అంతగా ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి సచిన్ అని కొనియాడింది. భారత్ మొత్తం ఇప్పుడు ఒకలాంటి ఉద్వేగంలో ఉందని... చివరి వేడుకలు జరుపుకుంటోందని తెలిపింది. కేవలం ఆటతోనే కాకుండా, వ్యక్తిత్వంతో కూడా సచిన్ ప్రజల మనసు దోచుకున్నాడని పేర్కొంది.
వంద కోట్ల మంది ప్రజల దృష్టిలో తమకు తెలిసిన ప్రపంచం ఈ వారంలో ముగిసిపోనుంది. విండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తో క్రికెట్ యోధుడి పోరాటం ముగియనుంది. ఫేర్ వెల్ టు క్రికెట్ లిటిల్ మాస్టర్.... అంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది. ప్రపంచ క్రీడా చరిత్రలో సచిన్ కూడా ఒక గొప్ప ఆటగాడిగా నిలిచిపోతాడని కొనియాడింది.
సచిన్ టెండూల్కర్ కెరీర్ లో 10 గొప్ప సంఘటనలను టైమ్ మేగజీన్ ప్రచురించింది. ఇందులో కాంబ్లీతో కలసి చేసిన 664 పరుగుల భాగస్వామ్యం, 23 ఏళ్లకే ఇండియా కెప్టెన్ కావడం, 2008లో టెస్టుల్లో బ్రియాన్ లారా చేసిన అత్యధిక పరుగులను అధిగమించడం, 2011లో ప్రపంచ కప్ గెలుచుకోవడం లాంటివి ఉన్నాయి. ఇలా, దాదాపు అన్ని ప్రముఖ యూఎస్ పత్రికలు సచిన్ ను ఆకాశానికెత్తేశాయి.