: బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం


బాలల దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో బాలల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బాలుడు విద్యావంతుడైతే ఒక్కడే లాభపడతాడని, బాలిక విద్యావంతురాలైతే కుటుంబమంతా చైతన్యవంతమవుతుందని అన్నారు.

విద్యకు ప్రాధాన్యత ఇస్తే జీవితం బాగుంటుందన్నారు. ఆటలు, పాటల్లో సంతోషంగా ఎలా పాల్గొంటామో... అలాగే చదువును కూడా ఆనందంగా చదవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం, తల్లిదండ్రులు, గురువులు అవకాశం మాత్రమే కల్పిస్తారని... కష్టపడాల్సింది మీరే అని దిశానిర్థేశం చేశారు. కష్టపడకుండా ఏదీ సాధ్యంకాదని అన్నారు. మీరు బాగా చదివి దేశాన్ని ముందుకు తీసుకెళ్తే భారత్ నెంబర్ వన్ గా ఎదుగుతుందని అన్నారు. ఇప్పటి తరానికి ఉన్నన్ని సదుపాయాలు తమ తరానికి లేవని గుర్తు చేశారు. మెరుగైన విద్య అందుబాటులో ఉందని, తెలివితేటలను సమర్థవంతంగా వినియోగించగలిగితే విద్యార్థుల భవిష్యత్తు పూలబాట అవుతుందని ఆయన తెలిపారు.

మరో వైపు బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో బాలల చలనచిత్రోత్సవ వేడుకలు ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా బాలల కోసం జంటనగరాల్లోని 10 థియేటర్లలో సినిమాలు ప్రదర్శించనున్నారు.

  • Loading...

More Telugu News