: రెండు, మూడు నెలల్లో పోయే ప్రధాని సీమాంధ్రకు న్యాయం చేస్తాడా? : చంద్రబాబు


కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాష్ట్ర విభజన తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. విభజన అనంతరం సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేస్తామని అంటున్నారని... రెండు, మూడు నెలల్లో పోయే ప్రధాని సీమాంధ్రకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. ఈ రోజు చంద్రబాబు తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మొద్దబ్బాయి కోసం... దత్తపుత్రుడు జగన్, అద్దె పుత్రుడు కేసీఆర్ తో కలసి సోనియా నాటకాలాడుతోందని మండిపడ్డారు. వైసీపీ, టీఆర్ ఎస్ ను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నీచమైన రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ మేరకు టీఆర్ ఎస్, వైసీపీలు డ్రామాలాడుతున్నాయని తెలిపారు.

తెలుగు జాతిని కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అవమానిస్తోందని చంద్రబాబు విమర్శించారు. విభజన ఏకపక్షంగా జరుగుతోందని దుయ్యబట్టారు. విభజన నిర్ణయంతో నెలకొన్న నిరసన నుంచి బయటపడేందుకే అన్ని పార్టీలకు లేఖలు రాశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు అభిప్రాయాలతో ఇద్దరు ప్రతినిధులు వెళ్లారని... వీరిలో 2014 జనవరి 1 నాటికి రాష్ట్ర విభజన జరుగుతుందని ఒకాయన... రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని మరొకాయన చెబుతున్నారని మండిపడ్డారు. షిండేతో బొత్స, కేసీఆర్ రహస్యంగా భేటీ అయ్యారని... ఆ సమావేశాల వెనకున్న రహస్యమేంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఒక్కో పార్టీకి 20 నిమిషాలు కేటాయించి రాష్ట్ర విభజన ఎలా చేస్తారని టీడీపీ అధినేత ప్రశ్నించారు. అఖిలపక్షం పేరుతో పార్టీలను ఇంటర్వ్యూ చేయడమేంటని మండిపడ్డారు. సమైక్యవాదం వినిపిస్తున్న వైకాపా... విభజన కోసం ఏర్పాటు చేసిన భేటీకి ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. వైసీపీ జనంలో ఒక మాట, ఢిల్లీలో మరో మాట చెబుతోందని అన్నారు. సోనియా ఆదేశాల మేరకే వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లారని తెలిపారు. ఇరుప్రాంతాల్లోని జేఏసీలను పిలిచి మాట్లాడమని తాము సూచించినా పట్టించుకోలేదని చెప్పారు. సమన్యాయం చేయమనే తెలుగుదేశం మొదటి నుంచి చెబుతోందని అన్నారు. రాజ్యంగ స్పూర్తికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. భాగస్వామ్య పక్షాలను కూర్చోబెట్టి చర్చించకపోవడం సమాఖ్య స్పూర్తికి విరుద్ధం కాదా? అని నిలదీశారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు పోటీ పడి విభజనకు సహకరిస్తున్నారని విమర్శించారు.

కేంద్రం మిథ్య, రాష్ట్రాలు శాశ్వతం అని ఎన్టీఆర్ ఏనాడో చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన ఆంటోనీ కమిటీ నివేదిక ఏమైందని ప్రశ్నించారు. పేపర్లో లీకులిచ్చిన ఆంటోనీ కమిటీ నివేదిక రెండు రోజుల్లోనే ఎందుకు మాయమయిందని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News