: నల్గొండ జిల్లాలో ఆర్టీసీ గరుడ బస్సుకు తప్పిన ముప్పు
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లికి సమీపంలో ఆర్టీసీ బస్సుకు మంగళవారం అర్ధరాత్రి పెద్ద ముప్పు తప్పింది. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ఏపీ 11 జెడ్ 6049 నంబరు గరుడ బస్సు నసర్లపల్లి సమీపానికి రాగానే లగేజీ బాక్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. కాలిన వాసన వస్తుండడంతో గమనించిన వెనుక సీట్లలో ఉన్న ప్రయాణికులు వెంటనే డ్రైవర్ ను అప్రమత్తం చేశారు. డ్రైవర్ బస్సును పక్కకు ఆపడంతో ప్రయాణికులందరూ ఆతృతగా కిందకు దిగారు. లగేజీ బాక్సులో మంటలు అంటుకున్నట్టు గుర్తించి అందుబాటులో ఉన్న నీటితో మంటలు అదుపు చేశారు. ఇంకా పొగలు రావడంతో అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. దీంతో ప్రయణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతనెల 30న మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు దగ్ధమై 45 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే.