: విభజన నిర్ణయం అనాలోచితం.. పునరాలోచించాలి: జీవోఎంతో మంత్రి వట్టి
విభజన నిర్ణయం అనాలోచితం అని, మరోసారి విభజన నిర్ణయంపై పునరాలోచించాలని మంత్రి వట్టి వసంతకుమార్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ సీడబ్ల్యూసీ నిర్ణయం ఏ రకంగానూ ఆమోదయోగ్యం కాదని అన్నారు. అరగంట పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జీవోఎంకు సమస్యలు వివరించారు. విభజన నిర్ణయం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఎన్నిరకాల ఇబ్బందులు కలుగుతాయో తెలిపామన్నారు.
జీవోఎం అడిగిన 11 అంశాలపై విద్య, ఉద్యోగ, ఆరోగ్య, జల సమస్యలపై వారికి వివరించడం జరిగిందని అన్నారు. ప్రజల సమస్యలు వారికి వివరిస్తూనే వారడిగిన 11 అంశాల్లో సమస్యలు ఎత్తి చూపామన్నారు. మెజారిటీ ప్రజల కోరికమేరకు మరోసారి విభజనపై ఆలోచించాలని కోరామని ఆయన తెలిపారు. వారడిగిన అంశాల్లో ఉన్న సాంకేతిక సమస్యలు చెప్పామని ఆయన అన్నారు. ఏ కమిటీలు, కమీషన్ లు జల సమస్యను పరిష్కరించలేవని ఆయన స్పష్టం చేశారు.