: పోలీసులకు 'మాటలు' నేర్పుతున్నారు!


పోలీస్‌ అంటేనే మాట కటువుగా ఉంటుంది. ఎందుకు అంటే తాము అలా మాట్లాడితేనే నిందితుల నోటినుండి నిజాలు బయటికొస్తాయని పోలీసులు చెబుతుంటారు. కానీ నిందితులు కరడుగట్టిన నేరస్తులైతే వారు చెప్పినట్టు మాట కటువుగా రావాలి. అలాకాకుండా నిజానిజాలను విచారించే సమయంలో చిన్న పిల్లలు, మహిళలను విచారించాల్సిన సమయంలో కూడా ఇంతే కరుకుదనాన్ని ప్రదర్శిస్తే అవతలివారి నోటినుండి నిజాలు సంగతి దేవుడెరుగు... అసలు గొంతులో నుండి మాట బయటికి పెకలిరాదు. అంతగా వారు బిగుసుకుపోతారు. నేటి కాలంలో చిన్నారులు, మహిళలపై దారుణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో చాలామంది కేసులను పెట్టడానికి పోలీస్‌ అంటే భయపడి పోలీస్‌ స్టేషన్‌ గడప ఎక్కలేకున్నారు. ఈ విషయంపై దారుణాలు జరుగుతున్నా కేసులు పెట్టకపోవడానికి కారణం ఏంటని ముంబై పోలీసులు ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో తేలిన విషయమేమంటే పోలీసులు విచారణ సమయంలో దురుసుగా ప్రవర్తించడం వల్ల చాలామంది కేసులు పెట్టడానికి ముందుకు రావడం లేదట.

పోలీస్‌ మార్క్‌ దురుసు ప్రవర్తనకు భయపడి సాక్షులు కూడా నోరువిప్పి నిజాలు చెప్పకపోవడంతో చాలా కేసులు ఏళ్లకు ఏళ్లు వాయిదా పడుతున్నాయి. కొన్నింటిని కొట్టేస్తున్నారు కూడా. ఇవన్నీ గమనించిన ముంబై పోలీసు అధికారులు పోలీసులకు అందునా మగ పోలీసులకు బాధిత మహిళలతో సౌమ్యంగా మాట్లాడే పద్థతులపై శిక్షణనివ్వడం మొదలుపెట్టారు. న్యాయం కోరుతూ వచ్చే వారికి మానసిక పరమైన సాంత్వన ఎలా అందించాలి? అనే అంశంపై పోలీసులకు శిక్షణనిస్తున్నారు. ఇందుకోసం మహిళాభివృద్ధి కోసం కృషి చేసే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులూ, మానసిక నిపుణులూ, సీనియర్‌ పోలీసు అధికారులు ఒక కోర్సును రూపొందించి రెండు మూడు వారాల పాటు తరగతులను నిర్వహిస్తున్నారు. ఇలా మహారాష్ట్రలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో పనిచేసే పోలీసులకు శిక్షణనివ్వాలని అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News