: ప్రధానికి కృతజ్ఞతలు.. వరదబాధితులను ఆదుకోవాలని కోరాం: సీఎం
వరదల వల్ల రాష్ట్రానికి 6,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రధానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ఫైలిన్, అల్పపీడనం వల్ల పంటలు, ఇళ్లు, రోడ్లు, చెరువులు వంటి వాటికి తీవ్ర నష్టం జరిగిందని, తమను ఆదుకోవాలని ప్రధానిని కోరామని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం తరపున వెయ్యి కోట్ల రూపాయల సహాయం చేయాలని కోరామని... తమ కోరికను సావధానంగా విన్న ప్రధాని వెయ్యి కోట్ల నిధులను విడుదల చేస్తామని తెలిపారని అన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
2009 నుంచి వచ్చిన తుపాను, కరవుల వల్ల రాష్ట్రానికి 1145 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని అప్పట్లో హైపవర్ కమిటీ నివేదిక విడుదల చేసిందని సీఎం తెలిపారు. నివేదిక అంతా సక్రమంగా ఉంటే నిధుల విడుదలకు ఆదేశాలిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని సీఎం తెలిపారు. తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉన్న నిబంధనలను సడలించాలని కోరామని, ఈ మేరకు మరోసారి ప్రధానికి లేఖ రాస్తామని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
రైతులకు మద్దతు ధర కల్పించాలని, గిడ్డంగులను ఏర్పాటు చేయాలని సూచించామని కిరణ్ అన్నారు. వరదల వల్ల రంగు మారిన ధాన్యం, పాడైపోయిన పత్తి కొనుగోలు చేయాలని కోరామన్నారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని సీఎం తెలిపారు. తుపాను బాధితులను పరామర్శించేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ రావాలనుకున్నారని... కానీ, వేరే కార్యక్రమాల వల్ల వారు రాలేకపోయారని సీఎం తెలిపారు.