: మంచితనానికి మారుపేరు... ఏవీఎస్
ఏవీఎస్ పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. 1957 జనవరి 2న గుంటూరు జిల్లా తెనాలిలో వీర రాఘవయ్య, శివ కామేశ్వరి దంపతులకు ఏవీఎస్ జన్మించారు. వృత్తి రీత్యా జర్నలిస్ట్ అయిన ఏవీఎస్, తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1993లో ఆయన చిత్ర రంగంలోకి తన కెరీర్ ను ఆరంభించారు. బాపు దర్శకత్వం వహించిన 'శ్రీనాథ కవి సార్వభౌముడు' అనే చిత్రంలో ఏవీఎస్ మొదటిసారి నటించారు. అయితే, ఈ చిత్రం వెంటనే విడుదల కాలేదు. బాపు దర్శకత్వం వహించిన మరో చిత్రం 'మిస్టర్ పెళ్లాం'లో కూడా ఏవీఎస్ నటించారు. ఈ సినిమానే ఏవీఎస్ ను తొలిసారిగా ప్రేక్షకులకు చూపించింది. తనకు సినిమా పరిశ్రమలో తొలి అవకాశం కల్పించిన బాపు, రమణలంటే ఏవీఎస్ కు చాలా అభిమానం. అందుకే తన సొంతింటికి 'బాపూరమణీయం' అనే పేరుపెట్టుకున్నారు.
తాను నటించిన తొలి చిత్రం 'మిస్టర్ పెళ్లాం' లో నటనకు గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఏవీఎస్ ను నంది అవార్డుతో సత్కరించింది. ఇదే సినిమాకు ఆయన ఎన్నో ఇతర అవార్డులు అందుకున్నారు. తన తొలి సినిమాతోనే ఆయన స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు.
సినీ రంగంలో అడుగుపెట్టిన నాటినుంచి ఏవీఎస్ ఏనాడూ వెనుదిరిగి చూసుకోలేదు. యాక్టర్ గా, కమెడియన్ గా, డైరెక్టర్ గా, నిర్మాతగా... తెలుగు సినీ కళామతల్లికి ఎంతో సేవచేశారు. గత 19 ఏళ్లలో ఏవీఎస్ దాదాపు 500 చిత్రాల్లో నటించారు. కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన తెలుగు ప్రేక్షకులను ఎంతో అలరించారు. నిర్మాతగా 'అంకుల్',' ఓరి నీ ప్రేమ బంగారం కానూ' చిత్రాలను నిర్మించారు. 'సూపర్ హీరోస్','ఓరి నీ ప్రేమ బంగారం కానూ', 'రూమ్ మేట్స్', 'కోతిమూక' చిత్రాలకు దర్శకత్వం వహించారు.
అంతే కాకుండా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా మూడు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మా సెక్రటరీగా ఆయన సంస్థ పురోభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా, సినీ కార్మికుల అభ్యున్నతికి కూడా ఆయన ఎంతో పాటుపడ్డారు. చిత్రాల్లో నటిస్తూనే ఏవీఎస్ విదేశాల్లో కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమాల వల్ల ఎంతో మంది చిన్న చిన్న నటీనటులకు ఉపాధి లభించేది.
ఏవీఎస్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవలే ఆయన వియ్యంకుడు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు