: ప్రేమించానంటూ బ్లాక్ మెయిల్ చేసి.. దాడి చేసిన ప్రేమ పిశాచి
ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. వెంటపడి వేధించాడు.. వికృత చేష్టలకు దిగాడు.. దాడి చేసి తలపగుల గొట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండే కారింకివారిపాలెం గ్రామంలో బొర్రా అనూషా సామ్రాట్ బాపట్లలో ఎంటెక్ చదువుతోంది. రోజు గ్రామం నుంచి గుంటూరు వరకు నడచి వచ్చి బాపట్లలోని కళాశాలకు వెళ్లి వస్తుంది.
గురువారం కూడా కళాశాల నుంచి వస్తున్న సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. స్పృహ కోల్పోయిన ఆమెను అటుగా వెళ్తున్నవారు గమనించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై రామిశెట్టి ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆసుపత్రిలో అనూషా సామ్రాట్ మీడియాతో మాట్లాడుతూ, గతేడాది గుంటూరులో ఓ హాస్టల్ లో ఉంటూ తాను బీటెక్ చదువుతున్నప్పుడు... హాస్టల్ వార్డెన్ గా పని చేసే, నూజెండ్లకు చెందిన బత్తుల కుమారస్వామి తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వేధించేవాడని చెప్పింది.
గతంలో కుమారస్వామి సోదరి వివాహం సందర్భంగా హాస్టల్ విద్యార్థినులతో కలసి వెళ్లినప్పుడు తీయించుకున్న ఫోటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యంగా చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసే వాడని... బీటెక్ తరువాత బాపట్లలో ఎంటెక్ లో చేరినా అతని వేధింపులు ఆగలేదని ఆమె తెలిపింది. గతంలో ఉన్న ఫోన్ నెంబర్లను మార్చినా, కొత్త నెంబర్లు తెలుసుకుని మరీ బెదిరింపులకు దిగేవాడని ఆమె తెలిపింది. గురువారం తనపై దాడి చేసిన ముసుగు వ్యక్తుల్లో ఒకడు కుమారస్వామేనని... అతని గొంతును తాను గుర్తుపట్టానని అనూషా సామ్రాట్ తెలిపింది.