: పట్టు బిగించిన భారత్... 120 పరుగుల లీడ్


విండీస్ తో కోల్ కతాలో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసి... కీలకమైన 120 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ రోజు ఆటలో సచిన్ 10 పరుగులతో నిరాశ పరిచినా... రోహిత్ శర్మ మాత్రం అదరగొట్టాడు. వంద వన్డేలు ఆడిన తర్వాత గానీ టెస్టుల్లో ఆరంగేట్రం చేయలేకపోయిన రోహిత్ శర్మ, తన తొలి మ్యాచ్ లోనే సత్తా చాటాడు. 228 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్ తో 127 పరుగులు చేశాడు. దీంతో, ఆరంగేట్రం చేసిన మ్యాచ్ లోనే సెంచరీ చేసిన 14వ భారత బ్యాట్స్ మెన్ గా రోహిత్ అవతరించాడు. రోహిత్ కు అండగా అశ్విన్ పూర్తి ఆధిపత్య ధోరణితో ఆడాడు. 148 బంతుల్లో 10 ఫోర్లతో అశ్విన్ 92 పరుగులు చేశాడు.

అంతకు ముందు, ఈ రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ ను వికెట్లేమీ నష్టపోకుండా 37 పరుగులతో ప్రారంభించిన భారత్ కు ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. విండీస్ బౌలర్ షిల్లింగ్ ఫోర్డ్ క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో భారత్ 156 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 23 పరుగులు చేసిన ధావన్ 42 పరుగుల వద్ద తొలి వికెట్ గా వెనుదిరిగాడు. 57 పరుగుల వద్ద 26 రన్స్ చేసిన మురళీ విజయ్ ఔటయ్యాడు. అనంతరం 17 పరుగులు చేసిన పుజారా కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో 199వ టెస్టు ఆడుతున్న సచిన్ కూడా 10 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మరుపురాని ఇన్నింగ్స్ తో అలరిస్తాడనుకున్న సచిన్... ఔటయ్యేసరికి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. షిల్లింగ్ ఫోర్డ్ బౌలింగ్ లో అంపైర్ తీసుకున్న ఓ వివాదాస్పదమైన నిర్ణయానికి సచిన్ బలయ్యాడు. వెంటనే కోహ్లీ కూడా కేవలం 3 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

తర్వాత ఇన్నింగ్స్ ను చక్కబెట్టే బాధ్యతను రోహిత్ శర్మ, ధోని తీసుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు విలువైన 73 పరుగులను జోడించారు. అనంతరం ధోనీ 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. తర్వాత, రోహిత్ కు అశ్విన్ జతకలిశాడు. వీరిద్దరూ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భారత్ ను గట్టెక్కించడమే కాకుండా... భారీ ఆధిక్యం దిశగా తీసుకెళ్లారు. విండీస్ బౌలర్లలో షెల్లింగ్ ఫోర్డ్ 4 వికెట్లు తీయగా, బెస్ట్, కోట్రెల్ చెరో వికెట్ తీశారు. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉంది.

  • Loading...

More Telugu News