: శవం కోసం ఎదురు చూస్తుంటే... మనిషే బతికొచ్చాడు!
ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయాడని సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా ఎదురు చూస్తున్న సమయంలో, అతను సజీవంగా తిరిగి రావడం ఆ కుటుంబంలో ఆనందాన్ని నింపింది. ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలంలోని కౌట్ల గ్రామానికి చెందిన మాని భోజన్న(45) గతేడాది మేలో ఖతార్ వెళ్లాడు.
వెళ్లిన వారానికే భోజన్న భవన నిర్మాణ కార్మికుడిగా చేరాడు. పని చేస్తూ భవనంపై నుంచి కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో అక్కడున్న ఏజెంట్ కు యాజమాన్యం ఈ విషయాన్ని ఫోన్ ద్వారా చెప్పింది. ఏజెంట్ మాత్రం భోజన్న చనిపోయాడని అతడి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. దీంతో, అతని మృతదేహాన్ని ఇప్పించాలంటూ వారు గల్ఫ్ రిటర్నింగ్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు చాంద్ పాషాను ఆశ్రయించారు. ఆయన కూపీ లాగగా భోజన్న బతికే ఉన్నాడని తెలిసింది. దీంతో అతన్ని స్వదేశం రప్పించేందుకు చర్యలు తీసుకున్నారు.
ఖతార్ లో పని చేస్తుండగా తను కింద పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారని, ఆసుపత్రి నుంచి బయటకు రాగానే పోలీసులు జైలులో పెట్టారని... చివరకు ఎంబసీ నుంచి ఔట్ పాస్ రావడంతో అక్కడున్న తెలుగు సోదరులు చందాలు వేసుకుని తనను స్వదేశానికి పంపారని తెలిపాడు.