: రొమ్ము క్యాన్సర్ మనదేశంలోనే ఎక్కువట
ఒకప్పుడు అరుదుగా కనిపించే రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు విజృంభిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య మన దేశంలో ఎక్కువగా కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. గత ఏడాది యాభై వేలమంది రొమ్ము క్యాన్సర్ బారిన పడితే, ఈ ఏడాది ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య ఇప్పటికే లక్షకు పైగా ఉందని వైద్యులు చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్‌కు గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన మగువలని తేడాలేదు. ఇది ఎవరికైనా వస్తుందని, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు ఈ క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి చికిత్స చేయించుకుంటున్నారని, కానీ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు వ్యాధి చివరి దశలో వైద్యులను ఆశ్రయించి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
గతంలో వందమంది రొమ్ము క్యాన్సర్ వ్యాధికి గురైతే వారిలో రెండు శాతం మంది ఇరవై నుండి ముఫ్ఫై ఏళ్లలోపు వారు, ఏడు శాతం మంది ముఫ్ఫై నుండి నలబై ఏళ్లలోపు వారు, అరవై తొమ్మిది శాతం మంది యాభై ఏళ్లకు పైబడిన వారు ఉండేవారు. కానీ ఇప్పుడు అది నలభై ఏళ్లలోపు వారికి కూడా వస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. మహిళల జీవన శైలిలో మార్పుల వల్లే చిన్న వయసులోనే రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఆలస్యంగా వివాహం చేసుకోవడం, హార్మోన్ల అసమతౌల్యత, గర్భనిరోధక సాధనాలను వాడడం వంటివి రొమ్ము క్యాన్సర్‌కు కారణాలుగా ఉంటున్నాయని, కాబట్టి ఇలాంటి వాటికి మహిళలు సాధ్యమైనంత దూరంగా ఉండడం వల్ల ఈ వ్యాధిని కొంతవరకైనా నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు.