: ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు కొత్త ఔషధం
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ప్రథమ స్థానంలో ఉంది. తొలిదశలోనే ఈ జబ్బును గుర్తిస్తేనే కానీ, దీనిని అరికట్టలేము. ఇక క్యాన్సర్ లో ఉన్న పలు రకాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకటి. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా పలు పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు శాస్త్రవేత్తలు 'ఎమ్ కె-3475' అనే కొత్త ఔషధాన్ని కనిపెట్టారు. ప్రయోగాల అనంతరం ఈ ఔషధం క్యాన్సర్ చికిత్సకు బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
పూర్తి ఊపిరితిత్తుల క్యాన్సర్ కు దారితీయక ముందు 'నాన్ స్మాల్ లంగ్ క్యాన్సర్' చికిత్సకు ఇది చాలా సమర్ధవంతంగా పని చేస్తుందని కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ విశ్వవిద్యాలయంలో అంకాలజీ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న డాక్టర్ ఎడ్వర్డ్ గారోన్ పేర్కొన్నారు. ఔషధానికి సంబంధించిన మొదటి దశ రెండో అధ్యయనం ప్రాధమిక ఫలితాలను ఆయన వెల్లడించారు. దీని ఆధారంగా మొదటి దశలో ఈ క్యాన్సర్ కు చికిత్స పొందుతున్న 38 మందిపై ఔషధాన్ని ప్రయోగించారు. మూడు వారాలకొకసారి ఎమ్ కె-3475 ఔషధాన్ని ఇచ్చారు. వారిలో 24 మంది ఈ మందుకి సానుకూలంగా స్పందించారని తెలిసింది. ఔషధం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు కూడా ఉండవని గారోన్ అంటున్నారు.