: ఆ మూడు హత్యలు డబ్బు కోసమే
విశాఖపట్టణం పెందూర్తి పరిధిలోని చినముషిడివాడ కార్మిక నగర్ లో నిన్న జరిగిన మూడు హత్యలు... కేవలం డబ్బుకోసమే జరిగాయని గాయాలతో బయటపడ్డ గణేష్ తెలిపాడు. ఈ ఘటనలో అతని తండ్రి, తాతయ్య, నాన్నమ్మలు మరణించారన్న విషయాన్ని గణేష్ కు పోలీసులు తెలియనివ్వలేదు. ప్రమాదం నుంచి బయటపడిన గణేష్ ఇంటర్ చదువుతున్నాడు. అతడు చెప్పిన తెలిపిన వివరాల ప్రకారం, కాలేజ్ నుంచి వచ్చిన తనను ఆడుకుందామని చెప్పిన అతని మేనమామ... కాళ్లు కట్టేసి, ముఖానికి ముసుగు వేసి రాడ్డుతో దాడి చేశాడు. అయితే అదృష్టవశాత్తు స్థానికుల సాయంతో గణేష్ తప్పించుకున్నాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రాజమండ్రి సమీపంలోని అన్నదేవర పేటకు చెందిన మంత్రి సన్యాసిరావు(70), ఎల్లమ్మ(65) దంపతుల కుమారుడు మంత్రి సాంబ(37) ఎనిమిదేళ్ల క్రితం చినముషిడివాడ వలస వచ్చారు. ఆ దంపతుల అల్లుడు పల్లాడ అసిరి నాయుడు వీరికి 50 వేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. కొంత కాలంగా ఈ బాకీ విషయంలో, అన్నదేవర పేటలోని ఆస్థి విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆదివారం మధ్యాహ్నం గణేష్ కుటుంబంతో వాదానికి దిగిన అసిరి నాయుడు... పథకం ప్రకారం ఇనుపరాడ్డుతో దాడిచేసి ముగ్గుర్నీ చంపేశాడు. అనంతరం మృత దేహాలను ఒక గదిలో పడేసి ఏమీ తెలియనట్టు ఉన్నాడు. కళాశాల నుంచి వచ్చిన గణేష్ కు భోజనం పెట్టి ఆడుకుందామని చెప్పి దాడికి దిగాడు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.