: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు.. 26 ఇళ్లు ధ్వంసం
బంగ్లాదేశ్ లోని పాబ్నా జిల్లాలో మైనారిటీలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని మెజారిటీ వర్గం యువకులు దాడులకు దిగారు. హిందువుల జనాభా ఎక్కువగా ఉన్న బోనోగ్రామ్ గ్రామంలో విధ్వంసం సృష్టించారు. గ్రామానికి చెందిన హిందూ యువకుడు దైవ దూషణకు పాల్పడ్డాడనే కారణంతో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. గ్రామంలోని హిందువులకు చెందిన 26 ఇళ్లను ధ్వంసం చేశారు. దేవతా విగ్రహాలు కూల్చివేశారు. 150 హిందూ కుటుంబాలను గ్రామం విడిచిపెట్టి పారిపోవాలని హుకుం జారీ చేశారు.
కాగా, దీనిపై బంగ్లాదేశ్ హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. దాడుల కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు 24 గంటల్లోగా నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మైనారిటీలకు పూర్తి రక్షణ కల్పించాలని పేర్కొంది. దాడులకు సంబంధించి తొమ్మిది మందిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వీరిలో ఎక్కువమంది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మద్దుతుదారులుగా వెల్లడించారు.