: కాసింత వెన్న తింటే మంచిదే
వెన్న తింటే కొలెస్టరాల్ పెరుగుతుంది, గుండెకు సంబంధించిన జబ్బులు వస్తాయని మనందరం అనుకుంటుంటాం. అయితే వెన్న తిన్నంత మాత్రాన గుండె జబ్బులు ఏమీ రావని, పైగా వెన్న వంటి పాల ఉత్పత్తులను తినడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
వెన్న, చీజ్, గడ్డపెరుగు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి అవి ఎంతగానో మేలు చేస్తాయని లండన్‌లోని భారత సంతతికి చెందిన కార్డియాలజిస్ట్ అసీమ్ మల్హోత్రా చెబుతున్నారు. వీటిలో ఎక్కువగా శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇలాంటి ఆహారాన్ని తగ్గించుకుంటే ఎంతో మేలని పలువురు వైద్య నిపుణులు చెబుతుంటారు. అలాకాకుండా ఇలాంటి ఆహార పదార్ధాల వినియోగం తగ్గించమని చెప్పడం తప్పని మల్హోత్రా రాసిన వ్యాసాన్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. ఆధునిక వైద్య విధానం నమ్ముతున్న అంశానికి విరుద్ధంగా శాచురేటెడ్ కొవ్వుల వాడకాన్ని తగ్గించడమే గుండెకు సంబంధించిన రోగాల ముప్పును పెంచుతోందని మల్హోత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాచురేటెడ్ కొవ్వుల వాడకాన్ని తగ్గించమని చెప్పడం ప్రజల్లో మందుల వాడకాన్ని ప్రత్యేకించి స్టాటిన్ల వాడకాన్ని పెంచుతోందని, అదే సమయంలో మరింత ప్రమాదకరమైన ఎథెరోజెనిక్ డైస్లిపిడెమియా (రక్తంలో కొవ్వుల నిష్పత్తి సరిగా లేకపోవడం) అనే ముప్పు పెరిగిపోతోందని ఆయన చెబుతున్నారు. కాబట్టి కాసింత వెన్న తీసుకోవడం మనకు మేలేనంటున్నారు.