: ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన భారత్.. ఆసీస్ విజయ లక్ష్యం 384


ఆసీస్ తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ 6 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. 384 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ 158 బంతుల్లో 16 సిక్సర్లు, 12 ఫోర్లతో 209 పరుగులు చేసి... ఆస్ట్రేలియా బౌలర్లకు మచ్చెమటలు పట్టించాడు. టాస్ ఓడి బ్యాంటింగ్ కు వచ్చిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు మంచి ప్రారంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 19.6 ఓవర్లలో 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 60 పరుగులు చేసిన ధావన్ ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి పరుగులేమీ చేయకుండానే రనౌట్ గా వెనుదిరిగాడు. తర్వాత రోహిత్ కు జతకలసిన రైనా దూకుడుగా ఆడాడు. 28 పరుగులు చేసిన రైనా 30వ ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన యువరాజ్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 12 పరుగులు మాత్రమే చేసిన యువరాజ్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్ కు ధోనీ దిగడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. రోహిత్, ధోనీ ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. ఫోర్లు, సిక్సులు తప్ప తమకు మరేమీ తెలియదన్నట్టు ఆడారు. ఈ దూకుడులో రోహిత్ ప్రపంచంలో సచిన్, సెహ్వాగ్ తర్వాత డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్ మన్ గా చరిత్రకెక్కాడు. చివరి ఓవర్లో మరో 3 బంతులుండగా మరో భారీ షాట్ కు ప్రయత్నించిన రోహిత్ 209 పరుగులు వద్ద ఔటయ్యాడు. చివరి బంతికి రెండో పరుగుకు వెళ్ళిన ధోనీ 62 (38 బంతులు, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేసి రనౌటయ్యాడు. నాటౌట్ గా నిలిచిన జడేజా ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేదు.

  • Loading...

More Telugu News