: పోరాడితే పోయేదేంలేదు.. ఇప్పుడదే బంగ్లా యువతకి ముద్దు!


విప్లవాల యుగం ఇది.. విప్లవిస్తే జయం మనది! రక్తం మరిగే ఈ రణన్నినాదం ఏ అభ్యుదయ కవి చేస్తేనేం..! ఇప్పుడది బంగ్లాదేశ్ యువతకు తారకమంత్రం! దశాబ్దాల తరబడి దేశాన్ని పీల్చిపిప్పి చేస్తున్న మతోన్మాదాన్ని మట్టి కరపించేందుకు అలాంటి శక్తిమంతమైన నినాదాలే బంగ్లా యువతలో పోరాటపటిమకు ఊపిర్లూదుతున్నాయి.

ఛాందసవాద జీవులకు చరమగీతం పాడదాం రండంటూ..  ఒకరికొకరు పిలుపునిచ్చుకుంటూ..  ముందుకు సాగుతున్న ఆ నెత్తురు మండే నవతరం..  ఇప్పడు ఢాకా వీధుల్లో కదం తొక్కుతూ పదం పాడుతూ లౌకికవాదం కోసం గర్జిస్తోంది.

ఒక్కసారి బంగ్లాదేశ్ లోని షాబాద్ స్క్వేర్ లో కనిపించే దృశ్యం చూస్తే..  మతమౌఢ్య రహిత సమాజం కోసం పరితపించే వేల హృదయాల రొద వినిపిస్తుంది. వారిని కార్యోన్ముఖుల్ని చేస్తున్న ఓ ముగ్గురు ధీర వనితల ఆత్మ స్థయిర్యం ఆకాశమంత ఎత్తున సాక్షాత్కరిస్తుంది.

ఇప్పుడా ముగ్గురిలో ఒకరైన బర్ష ష్రబంతి 'అక్తర్ షాబాగ్ స్క్వేర్'లో ప్రతిరోజూ తన ఉక్కు సంకల్పాన్ని చాటుతుంటారు. 1971లో బంగ్లాదేశ్ ను అట్టుడికించిన యుద్ధనేరాల నిందితుడు దెల్వర్ హుస్సేన్ కు మరణశిక్ష విధించాల్సిందేనని భారీ సంఖ్యలో అక్కడికి చేరే యువతకు ఉత్తేజం కలిగిస్తారు. మతవాదంతో మత్తెక్కిన మూర్ఖుల కరకు గుండెలను తన పదునైన నినాదాలతో చీల్చేందుకు సదా సంసిద్ధురాలై ఉండే బర్ష.. ఆ ప్రయత్నంలో తన చుట్టూ ఉన్నవారి్ని సైతం తన భావ ప్రకటన శైలితో తన వైపుకు తిప్పుకుంటారు.

దెల్వర్ కు ఉరిపై జమాతే మతవాద సంస్థ దేశంలో చిచ్చురేపేందుకు కుటిల యత్నాలు చేస్తున్నా... యువతరం గుండెనిబ్బరంతో ఆ విపత్తును ఎదుర్కొనేందుకు సమాయత్తమైందంటే అందుకు బర్షలాంటి వీర వనితలే కారణం. అందరికీ బర్ష స్పూర్తి అయితే, బర్ష తనకు ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ ప్రేరణ అంటోంది. ఆమె పో్రాటస్ఫూర్తి తనకు ఆదర్శమని బర్ష చెబుతోంది.

ఇస్లామియా కాలేజీలో చదువుకుంటున్న బర్ష ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జనాకర్షణ ఉన్నవ్యక్తి. ఇదిలావుంటే, 1971 నాటి విముక్తి పోరాటంలో భారత్ తమకు సహకరించినట్టే మరోసారి పెద్దన్న పాత్ర పోషించాలని అత్యధికులు ఆకాంక్షిస్తున్నారు. 

  • Loading...

More Telugu News