: అఖిల పక్షాన్ని బహిష్కరించండి: అశోక్ బాబు
అఖిలపక్ష సమావేశాన్ని అన్ని రాజకీయ పార్టీలు బహిష్కరించాలని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు పిలుపునిచ్చారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కొన్ని పార్టీల అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకుని ప్రజాభిప్రాయంగా చిత్రీకరించడం సరికాదని హితవు పలికారు. 371 డీ ఆర్టికల్ రద్దు చేయకుండానో లేక సవరించకుండానో విభజన సాధ్యం కాదని ఆయన అన్నారు. తాము గతంలో చెప్పిన విషయాన్నే కేంద్ర హోం శాఖ ఇప్పుడు చెబుతోందని ఆయన అన్నారు.
తమను రాజకీయ నాయకులు చులకన చేస్తూ మాట్లాడుతున్నారని, ఉద్యోగులు నోరు విప్పితే రాజకీయనాయకుల బ్రతుకులు ఏమవుతాయో గుర్తించుకోవాలని ఆయన హెచ్చరించారు. సమైక్యవాదం బలహీన పడిందన్న దానిలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం విభజన విషయంలో దూకుడు తగ్గించిందంటే కారణం ఉద్యమమేనని అన్నారు. 8 కోట్ల ఆంధ్రుల్లో 6 కోట్ల మంది ఆంధ్రులు విభజనను వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని గుర్తించుకోవాలని ఆయన సూచించారు.