: 'ఉక్కు మనిషి'కి సమున్నత విగ్రహం.. 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ'


దేశం గర్వించదగ్గ నాయకుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్థానం ప్రత్యేకమైందే కాదు, విస్మరించరానిది కూడా. స్వాతంత్ర్యానికి ముందు, ఆ తర్వాత భారత్ స్థితిగతులకు ఈయన సాక్షీభూతంగా నిలిచాడు. అన్నింటికన్నా ముఖ్యంగా.. విభిన్న మతాలు, కులాలు, వర్గాలతో ఉన్న దేశానికి భారతీయతను ఆపాదించింది పటేల్ మహాశయుడే. అప్పట్లో లెక్కకుమిక్కిలిగా ఉన్న సంస్థానాలు పటేల్ మొక్కవోని పట్టుదల కారణంగానే భారత్ లో విలీనమయ్యాయి. తద్వారా విశాల భారతావని ఏర్పడింది.

జవహర్ లాల్ నెహ్రూ సర్కారులో హోం శాఖ మంత్రిగా వ్యవహరించిన పటేల్ విలీనమయ్యేందుకు మొండికేసిన సంస్థనాధీశులను తన కఠిన వైఖరితో దారికితెచ్చాడు. అందుకే ఆయనను ఉక్కుమనిషిగా గానూ, ఇండియన్ బిస్మార్క్ గానూ పిలుస్తారు. రేపు ఆయన జయంతి. కాగా, స్వరాష్ట్రం గుజరాత్ లో ఆయనకు సమున్నత రీతిలో స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని అక్కడి సర్కారు తలపోస్తోంది. ఈ భరతమాత ముద్దుబిడ్డ ఘనతకు గుర్తుగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గుజరాత్ సర్కారు నిర్ణయించింది. అందుకు స్థల నిర్ణయం కూడా జరిగింది.

గుజరాత్ లోని భరూచ్ కు సమీపంలో నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్ కు అభిముఖంగా ఉన్న సాధుబెట్ దీవిపై పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం నరేంద్ర మోడీ నిశ్చయించారు. వల్లభాయ్ 138వ జన్మదినాన్ని పురస్కరించుకుని రేపు మోడీ భూమి పూజ చేయనున్నారు. కాగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరిట ఏర్పాటు చేస్తున్న విగ్రహం ప్రతిపాదిత ఎత్తు 182 మీటర్లు (597 అడుగులు). ఇందులో విగ్రహం ఎత్తు 157 మీటర్లు కాగా, పీఠం ఎత్తు 25 మీటర్లు. నర్మదా తీరం నుంచి సాధుబెట్ దీవిలోని ఈ విగ్రహం వద్దకు చేరుకునేందుకు ప్రత్యేకమైన వంతెన నిర్మించనున్నారు. అంతేగాకుండా, పటేల్ స్మారక వనాలు, కన్వెన్షన్ సెంటర్, హోటల్, అమ్యూజ్ మెంట్ పార్క్, రీసెర్చ్ సెంటర్లు, ఇన్ స్టిట్యూట్లను నిర్మిస్తారు.

రూ.2,500 కోట్లతో ఈ విగ్రహ నిర్మాణం చేపట్టనున్నారు. ప్రతిష్ఠాత్మక బుర్జ్ ఖలీఫా టవర్లను నిర్మించిన టర్నర్ కన్ స్ట్రక్షన్ కన్సార్టియం ఈ భారీ ప్రాజెక్టును పర్యవేక్షించనుంది. కాగా, చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ విగ్రహాన్ని ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా పరిగణిస్తున్నారు. దీని ఎత్తు 502 అడుగులు. ఇక, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెరికా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎత్తు 354 అడుగులు కాగా.. గుజరాత్ సర్కారు నిర్మిస్తున్న పటేల్ విగ్రహం వీటన్నింటినీ వెనక్కినెట్టనుంది.

ఈ విగ్రహ నిర్మాణాన్ని పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించాలని నిర్ణయించారు. అందుకే, తమ వద్ద ఉన్న పాత ఇనుప సామాన్లను విగ్రహ నిర్మాణం కోసం విరాళంగా ఇవ్వాలని మోడీ దేశంలోని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

  • Loading...

More Telugu News