: పెళ్లి రోజే మృత్యు ఒడికి చేరిన దంపతులు
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన సుందర్ రాజు, విజయ మేరి దంపతులు మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందారు. తమ పెళ్లి రోజే వారు తిరిగిరాని లోకాలకు పయనం కావడం పట్ల బంధువులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఈ దంపతులు గత నాలుగు సంవత్సరాలుగా కూతురి చదువు నిమిత్తం బెంగళూరులో నివాసముంటున్నారు. నెలకోసారి వైద్య పరీక్షలు, మందుల కోసం దంపతులిద్దరూ హైదరాబాద్ వస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తుండగా బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విజయ మేరి తల్లిదండ్రులు సైతం 1989లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు సమాచారం.