: అధికారం అనుభవిస్తూ ఏం చేశారు?: వివేక్ కు సోమిరెడ్డి సూటి ప్రశ్న
టీఆర్ఎస్ ఎంపీ వివేక్ వ్యాఖ్యలపై టీడీపీ నేత సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ లో మీరు, మీ తండ్రి అధికారం అనుభవించినన్నాళ్లూ నోరెత్తకుండా ఉన్నారు. ఇప్పుడు అన్యాయం జరిగిందని ఎలా అంటున్నారు?' అని ప్రశ్నించారు. 'కేసీఆర్ నోట దళిత సీఎం మాట వచ్చాక పార్టీ మారిన మీకు టీఆర్ఎస్ లోకి వెళ్ళాక ఉన్న మతులు పోయాయా?' అని మండిపడ్డారు. 'మీరు మాట్లాడే మాటలు విచక్షణతోనే మాట్లాడుతున్నారా? రాజధాని కోసం హైదరాబాద్ శివార్లలో టెంటేసుకొమ్మంటారా?' అని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్టు మూడు ప్రాంతాలకు న్యాయం చేయగలిగితేనే విభజన జరగాలని.. లేకుంటే వచ్చే ఎన్నికల వరకు నోరు మూసుకుని అధికారంలో కూర్చుని, ఆ తరువాత పెట్టే బేడా సర్దుకోవాలని ఆయన సూచించారు. 57 ఏళ్లపాటు కలిసి అభివృద్ధి చేసుకుంటే ఏరుదాటాక తెప్పతగలేసిన చందంగా ఎలా వెళ్లి పోమ్మంటారని ఆయన అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిసినప్పుడు 93 లక్షల అప్పుతో కలిసిందని గుర్తు చేశారు. ఇప్పుడు దాని ఆదాయం ఎంత? అని ఆయన అడిగారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు ఉండి పక్షపాతంతో వ్యవహరించి తెలంగాణను బాగుచేశారని, సీమాంధ్రలకు అన్యాయం చేశారని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
దాన్ని రివర్స్ చేసి తెలంగాణ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు 2012-2013 బడ్జెట్ లో 68 వేల కోట్ల రూపాయల ఆదాయంలో 48 వేల కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ రెవెన్యూ ఏం చేస్తారో, ఎలా పంచుతారో చెప్పకుండా ఎలా విభజిస్తారని ఆయన కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయకుండా ఢిల్లీలో కూర్చుని విభజన అంటే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో 60 శాతం ప్రజలున్న ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు ఏ రకంగా న్యాయం చేస్తుందో చెప్పకుండా రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలకు వెళతామని కాంగ్రెస్ పార్టీ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలంగాణ కాంగ్రెస్, టీఆర్ఎస్, టీజేఏసీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కుట్ర జరుగుతోందని, ప్రజలను ముంచేసే అతిపెద్ద కుట్రలో కాంగ్రెస్ నేతలు భాగస్వాములు కావొద్దని ఆయన అన్నారు.