: ఘటన దురదృష్టకరం: బొత్స
జబ్బార్ ట్రావెల్స్ బస్సు దుర్ఘటనలో చిన్నారి సహా 45 మంది అసువులు బాసారని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. హైదరాబాదులోని ఆర్టీఏ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు, ఫోన్ నెంబర్లు అందాయని, వారి బంధువులకు పూర్తి సమాచారం అందించే ఏర్పాట్లు చేశామని వివరించారు. మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. త్వరలోనే మృతుల కుటుంబాలకు సహాయం అందజేస్తామని అన్నారు. ప్రైవేటు డ్రైవర్లపై నియంత్రణ ఉండడం లేదని, అందువల్లే దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రయాణీకుల భద్రతను ప్రైవేటు ట్రావెల్స్ దృష్టిలో ఉంచుకోవాలని ఆయన స్పష్టం చేశారు.