: ఢిల్లీలో మహిళల భద్రతకు అమెరికా సహాయం
దేశ రాజధాని ఢిల్లీని మహిళలకు అత్యంత భద్రతగల నగరంగా మార్చేందుకు చేపట్టిన కార్యక్రమానికి అగ్రరాజ్యం అమెరికా తనవంతు సాయం అందించింది. ఇందుకోసం 250,000 (రూ.1,53,61,228) డాలర్లను కేటాయించింది. భారతీయ పౌర సామాజిక సంస్థల భాగస్వామ్యంతో 'ఢిల్లీ సేఫ్ సిటీ-ఫ్రీ ఆఫ్ వయొలెన్స్ ఎగైనెస్ట్ ఉమన్ అండ్ గాళ్స్'ను ఏర్పాటుచేశారు. మహిళలకు ఢిల్లీని అత్యంత రక్షణ కలిగిన నగరంగా మార్చటమే దీని లక్ష్యం. దీనిపై భారత్ లో యూఎస్ అంబాసిడర్ నాన్సీ జె పావెల్ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న హింస అతిపెద్ద నేరంగా అమెరికా గుర్తించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద నగరాల్లో మహిళలకు రక్షణ కల్పించేందుకు యునైటెడ్ నేషన్స్ 'ఉమెన్స్ గ్లోబల్ సేఫ్ సిటీస్ ఇనిషియేటివ్' పేరుతో సహాయం చేస్తోంది. ఈ కార్యక్రమంలో అమెరికా కూడా భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ పథకం ద్వారానే ఢిల్లీకి సాయం అందించారు.