: కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీపై ఎల్డీఎఫ్ కార్యకర్తల రాళ్ల దాడి
కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీపై లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. సౌరకుంభకోణానికి సంబంధించి ఆందోళన నిర్వహిస్తున్న కార్యకర్తలు, పోలీసు శాఖకు సంబంధించి ఓ కార్యక్రమానికి వస్తున్న సీఎం వాహనంపై దాడి చేశారు. కాగా, ఈ ఘటనలో చాందీ నుదుటికి స్వల్ప గాయమైంది. అయినప్పటికీ ఆయన తన పర్యటనను ఆపకుండా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు ఎల్డీఎఫ్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సౌరకుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని నెలలుగా ఎల్డీఎఫ్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.