: జగన్, కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం బయటపెట్టాలి: సోమిరెడ్డి


జగన్, కేసీఆర్ మధ్య జరిగిన రహస్య ఒప్పందాన్ని బయటపెట్టాలని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాదులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజనపై ఏదైనా అడగాలని ఉంటే జగన్ ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని అడగాలని హితవు పలికారు. సమైక్య సభ పెట్టింది చంద్రబాబును తిట్టేందుకా? అని ఆయన ప్రశ్నించారు. సమైక్య శంఖారావానికి జగన్ చేసిన ఖర్చు 200 కోట్ల రూపాయలని సోమిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై పార్లమెంటులోనూ, సోనియా నివాసం ఎదుట ధర్నా చేసిన ఘనత తెలుగుదేశానిదేనని ఆయన తెలిపారు. రాజకీయాలు చెడిపోయాయని జగన్ అనడం చూసి తన మైండ్ బ్లాంక్ అయిందని ఆయన అన్నారు.

జగన్ తప్పుడు రాజకీయాలు చేస్తూ నీతులు వల్లించడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించడంలా ఉందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాదులో ఆస్తుల విలువ తగ్గిపోతుందని జగన్ బాధపడుతున్నారని అన్నారు. విభజనకు అసలు కారకుడైన కేసీఆర్ ను, 'సీమాంధ్రులు దోపిడీ దొంగలు' అంటూ విరుచుకుపడే టీఆర్ఎస్ ను జగన్ ఏమీ అనకుండా ఉండడాన్ని చూస్తే వీరి మధ్య ఒప్పందం జరిగినట్టు స్పష్టమవుతోందన్నారు. అదేంటో బయటపెట్టాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News