: లావుకావడానికి కారణమేమంటే...
ఇప్పుడు యువతను ఎక్కువగా వేధిస్తున్న సమస్య ఊబకాయం. దీన్ని తగ్గించుకోవడానికి నానా పాట్లు పడుతుంటారు. అసలు ఊబకాయం ఎందుకొస్తుంది... ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా ఊబకాయానికి దోహదం చేస్తాయి. అలాకాకుండా మనలోని ఒక ప్రత్యేకమైన జన్యువు కూడా ఊబకాయానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో బయటపడింది. ఈ జన్యువు మూలంగా శరీరంలో కేలరీలు ఖర్చయ్యే సామర్ధ్యం తగ్గుతోందని, ఫలితంగా ఊబకాయం వస్తోందని పరిశోధకులు గుర్తించారు.
బ్రిటన్‌కు చెందిన వెల్‌కం ట్రస్ట్ సాంగర్ ఇన్‌స్టిట్యూట్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంకు చెందిన పరిశోధకులు శరీరంలోని కేఎస్‌ఆర్2 అనే జన్యువులో తలెత్తే లోపం మూలంగా శరీరంలో కేలరీలు ఖర్చయ్యే సామర్ధ్యం తగ్గుతున్నట్టు గుర్తించారు. ఈ లోపాలు జీవసంబంధ మార్గ సంకేత వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నట్టు, ఇది జీవక్రియలను మందగించడానికి దారితీస్తున్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఫలితంగా ఊబకాయం, దాని ఫలితంగా మధుమేహం వంటి కొత్త సమస్యలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తాము నిర్వహించిన అధ్యయన ఫలితాలు ఊబకాయం, మధుమేహం సమస్యలకు కొత్తరకం చికిత్సల రూపకల్పనకు ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలోని కేలరీలు ఖర్చయ్యే తీరు అందరిలో ఒకేలా ఉండదని, కొందరిలో వేగంగా ఖర్చవుతాయని, కొందరిలో నెమ్మదిగా ఖర్చవుతుంటాయని, కేఎస్‌ఆర్2 జన్యువులో తలెత్తే లోపాలు ఈ జీవక్రియలపై ప్రభావం చూపుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందని సహ అధ్యయనకర్త డాక్టర్ బారోసో చెబుతున్నారు.