: విదేశీ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వినోద్ కాంబ్లీ
మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఓ విదేశీ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తనపై జాతి వివక్ష పూరిత వ్యాఖ్యలు చేసిందని కాంబ్లీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాల్లోకెళితే.. బాంద్రాలోని జ్యువెల్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ బిల్డింగ్ వద్ద కారు పార్క్ చేసే విషయమై కాంబ్లీతో విదేశీ మహిళ గొడవకు దిగింది. మాటా మాటా పెరిగి ఆమె కాంబ్లీని 'బ్లాక్ ఇండియన్' అని అర్థం వచ్చేలా సంబోధించింది. దీంతో, కాంబ్లీ బాంద్రా పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు.
ఈ సందర్భంగా కాంబ్లీ మీడియాతో మాట్లాడుతూ, వివాదంపై హౌసింగ్ సొసైటీ చైర్మన్ తో మాట్లాడాలని ఆమెకు సూచించానని తెలిపాడు. కానీ, ఆమె తనకు భారత్ లోనూ, విదేశాల్లోనూ పలువురు తెలుసని ఆవేశంగా మాట్లాడిందని, ఆ క్రమంలోనే 'బ్లాక్ ఇండియన్' అని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించిందని వివరించాడు. ఆమె ఉపయోగించిన జాత్యహంకార మాటలు తననెంతగానో బాధించాయని కాంబ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు.