: ఫార్ములా-1రేసుపై స్టే కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్
మరో రెండు రోజులలో ప్రారంభం కానున్న ఫార్ములా-1 కారు రేసులపై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని సుప్రీం ధర్మాసనం రేపు విచారించనుంది. ఫార్ములా-1 రేస్ ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో శని, ఆదివారాల్లో జరగనుంది. దీనిపై స్టే కోరుతూ అమిత్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. నోయిడాలో 2012లో నిర్వహించిన రేసుకు సంబంధించిన పన్నును నిర్వాహకులు ఇంకా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించలేదని, కనుక తాజా పోటీలపై నిషేధం విధించాలని పిటిషనర్ కోరారు.
2011లో భారత్ లో తొలి ఫార్ములా-1 రేస్ నిర్వహించగా.. అప్పట్లో నిర్వహణ సంస్థ జైప్రకాశ్ గ్రూపు వినోద పన్ను చెల్లించనవసరంలేదంటూ అప్పటి మాయావతి సర్కారు మినహాయింపు కల్పించింది. అయితే, మాయావతి సర్కారు ఆదేశాలు రద్దు చేయాలని కోరుతూ అఖిలేశ్ సర్కారు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లింది. దాంతో, పన్ను చెల్లించాలని సుప్రీంకోర్టు జేపీ గ్రూపును ఆదేశించింది. అయినా, పన్ను చెల్లించకుండానే జేపీ గ్రూపు మళ్లీ ఫార్ములా-1 రేసు నిర్వహణకు సమాయత్తం కావడంతో అమిత్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.