: ముగిసిన విచారణ.. ఉగ్రవాదులను ఢిల్లీకి తరలించిన ఎన్ఐఏ
మూడు రోజుల పాటు విచారణ చేసిన తర్వాత ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మక్బూల్, ఇమ్రాన్ లను ఎన్ఐఏ అధికారులు ఈ ఉదయం ఢిల్లీకి తీసుకెళ్ళారు . వారి కస్టడీ ముగియడంతో నేడు ఢిల్లీలోని స్థానిక కోర్టులో హాజరుపరుస్తారు.
మూడూ రోజుల విచారణలో భాగంగా ఎన్ఐఏ అధికారులు ఈ ఇద్దరి నుంచి చాలా వివరాలు రాబట్టారు. హైదరాబాద్ లో 12 చోట్ల పేలుళ్లకు రెక్కీ నిర్వహించామని ఆయా ప్రాంతాల పేర్లను వారు వెల్లడించారు. అలాగే స్లీపర్ సెల్స్, పేలుళ్లకు సంబంధించి ఎవరెవరితో సమాచార సంబంధాలు నెరిపారు తదితర వివరాలన్నింటినీ వారి నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల ప్రాంతంలోని సీసీటీవీ కెమేరాలలో ఉన్న అనుమానితుడి దృశ్యాలను మక్బూల్ గుర్తించడం కూడా జరిగింది. వాస్తవానికి మరెన్నో వివరాలను వీరి నుంచి ఎన్ఐఏ అధికారులు రాబట్టారు. దర్యాప్తు దశలో ఉన్నందున వాటి వివరాలు పెద్దగా బయటకు పొక్కలేదు.