: రాజధాని, శతాబ్ది రైళ్ళలో రోగులకు ప్రత్యేక ఆహారం
అనారోగ్యంతో బాధపడే వ్యక్తులకు ఇక నుంచి రాజధాని, శతాబ్ది రైళ్ళలో ప్రత్యేక ఆహారం అందించనున్నారు. మధుమేహం, ఇతర వ్యాధులకు చికిత్స పొందుతున్న వ్యక్తులకు వారివారి శరీర స్థితిని అనుసరించి ఈ రైళ్ళలో ఆహారపదార్ధాలు వడ్డిస్తారు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఎంపీ జగత్ ప్రకాశ్ నద్దా ఫిబ్రవరిలో రాసిన ఓ లేఖకు బదులిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. డయాబెటిస్, కార్డియో వాస్కులార్ (హృదయ సంబంధమైన) సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ప్రత్యేక ఆహారం అందించాలని నద్దా ఆగస్టులో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో రాజ్యసభలోనూ కోరారు.
నద్దా ఈ విషయమై జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఈ రైళ్ళలో మామూలు ప్రయాణికులకు అందించే ఆహారంలో బటర్, పచ్చళ్ళు, జామ్, పంచదారతో తయారైన పదార్థాలు ఉంటాయని చెప్పారు. అవి మధుమేహ రోగులు, హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు తినకూడని పదార్థాలని తెలిపారు. వాటిని రోగులకు వడ్డించడం వల్ల అవి వృథా అవుతాయని, వాటికి బదులు సాత్వికాహారం అందిస్తే రోగులకు ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.