: వ్యాపారాలకు దేశంలో బెంగళూరే బెస్ట్.. 11వ స్థానంలో హైదరాబాద్
భారతదేశంలో అత్యుత్తమ వ్యాపార కేంద్రంగా సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరు నిలిచింది. గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ రీస్ట్రక్చరింగ్ ఎన్విరాన్ మెంట్ అండ్ మేనేజ్ మెంట్, డీటీజెడ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వే ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. భారత్ లో 21 అత్యున్నత వ్యాపార కేంద్రాలను గుర్తించడం కోసం ఈ సర్వేను నిర్వహించారు. మౌలిక వసతులు, కల్చర్, మానవ వనరులు, నీటి లభ్యత, కార్యాలయ స్థలం లభ్యత, హౌసింగ్, హెల్త్ కేర్, వాతావరణం, విద్యుత్తు, రవాణా వ్యవస్థ, శాంతిభద్రతలు మొదలైన అంశాలను సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు.
బెంగళూరు తర్వాత స్థానాలను వరుసగా చెన్నై, ముంబై, పుణె నగరాలు ఆక్రమించాయి. వీటి తర్వాత ఇండోర్ (5), భువనేశ్వర్(6), కోయంబత్తూరులు(7) లిస్టులో చోటు సంపాదించాయి. విచిత్రమేంటంటే... మన దేశ రాజధానికి ఈ లిస్టులో చోటు దక్కలేదు. ఒకానొక సమయంలో ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు గడించిన హైదరాబాద్ ప్రతిష్ఠ ప్రస్తుతం మసకబారింది. మన భాగ్యనగరం ఈ జాబితాలో 11వ స్థానానికి పరిమితమైపోయింది. విశాఖపట్నం 21 వ స్థానంలో నిలిచింది.