: హైదరాబాద్ ను యూటీ చేసేందుకు కృషి చేస్తున్నాం : కేంద్ర మంత్రి జేడీ శీలం
రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమైందని... దీన్ని అడ్డుకునేందుకు శక్తి మేరకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. విజయవాడలో ఆయన్ను సమైక్యవాదులు అడ్డుకుని ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యమకారులతో మీడియా సమక్షంలో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై చిత్తశుద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని... కాంగ్రెస్ ను దోషిగా చిత్రీకరించరాదని అన్నారు. ఇకపై తాము ఉద్యమకారులతోనే మాట్లాడతామని... రాష్ట్ర మంత్రులతో మాట్లాడమని తెలిపారు.
తమకు అవకాశం ఉన్నంత వరకు విభజనను అడ్డుకునే ప్రయత్నం చేస్తామని కేంద్ర మంత్రి అన్నారు. హైదారాబాద్ ను యూటీ చేసేందుకు తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నియంతల పార్టీ కాదని... ఇక్కడ అందరికీ తమ అభిప్రాయాలు చెప్పుకునే వాతావరణం ఉందని తెలిపారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలపై సోనియాకు నివేదిక ఇస్తామని జేడీ శీలం అన్నారు. సీమాంధ్ర ప్రజలు మమ్మల్ని కాక ఇంకెవరిని అడ్డుకుంటారని? ప్రశ్నించారు. విభజన విషయంలో మిగిలిన పార్టీలపై తాను కామెంట్ చేయనని తెలిపారు.